కమల దళానికి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. ఈ విషయాన్ని ప్రస్తుత భాజపా జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం (డిసెంబరులో) ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
'అమిత్‌షా పార్టీలో సూపర్ పవర్‌గా కొనసాగుతారు.. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత కూడా వెనుక నుంచి పార్టీ వ్యవహారాలను నడిపిస్తారు...' అని వినిపిస్తున్న అభిప్రాయాలను ఆయన ఖండించారు. 'మా పార్టీ కాంగ్రెస్‌లా కాదని, తెర వెనుక నుంచి ఆదేశాలు ఎవరూ ఇవ్వరని' హస్తం పార్టీని ఎద్దేవా చేశారు. ఏ నిర్ణయమైనా పార్టీ సిద్ధాంతాల ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రస్తుత భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడైన జేపీ నడ్డా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా... అమిత్‌షా స్థానాన్ని భర్తీ చేస్తారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అనే భాజపా సిద్ధాంతం ప్రకారం అమిత్ షా కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. కొత్త అధ్యక్షుడు ఎవరన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలిపారు కేంద్రమంత్రి.
ఈ నెల 21న మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి:సొంత ఛాపర్ కూల్చివేతలో ఆరుగురిపై ఐఏఎఫ్ చర్యలు!