21వ శతాబ్దాపు విద్యా ప్రమాణాలను అందుకోవడమే లక్ష్యంగా నూతన జాతీయ విద్యా విధానం రూపుదిద్దుకుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం 2020 అమలు అనే అంశంపై విజిటర్స్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా సమానమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నూతన జాతీయ విధానం నిర్దేశిస్తుందని కోవింద్ తెలిపారు. భారత్‌ను ప్రపంచ విజ్ఞాన శక్తిగా మార్చాల్సిన బాధ్యత ఉన్నత విద్యా సంస్థలపై ఉందన్న ఆయన ఈ సంస్థలు నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలు ఇతర సంస్థలు అనుసరిస్తాయన్నారు.
ఆవిష్కరణలు, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే విధానం నూతన విద్యా విధానం ప్రాథమిక సూత్రాల్లో ఉందని రాష్ట్రపతి తెలిపారు. తక్షశిల, నలంద కాలం నాటి భారత అభ్యాస వైభవాన్ని నూతన విద్యా విధానం పునరుద్ధరించే అవకాశం ఉందని కోవింద్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో అన్ని కేంద్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఐఐటీ, ఎన్ఐటీల డైరెక్టర్లు పాల్గొన్నారు.