బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి ఊపందుకున్న వేళ.. 6 పార్టీలతో కొత్త కూటమి(ఫ్రంట్) గురువారం ఏర్పాటైంది. ఇప్పటికే అధికార ఎన్డీఏ కూటమి, ప్రధాన ప్రతిపక్షాలతో కూడిన 'మహాకూటమి' ఎన్నికల బరిలో ఉన్నాయి. తాజాగా 'గ్రాండ్ డెమొక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్' పేరిట మరో కూటమిని ఏర్పాటు చేసినట్లు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వహ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీలు ప్రకటించారు. ఈ కూటమికి దేవేంద్ర యాదవ్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ఉపేంద్ర కుష్వహ తెలిపారు.
"ఎన్నికల్లో కొత్త కూటమికి ప్రజలు పట్టం కడితే ఉపేంద్ర కుష్వహ ముఖ్యమంత్రి అవుతారు. కొత్త కూటమి ద్వారా బిహార్ ప్రజలకు మేము ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నితీశ్ కుమార్ 15 ఏళ్ల పాలనలో బిహార్ ప్రజలు మోసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రత్యామ్నాయం అవసరం"
-- అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం అధినేత
కొత్త కూటమిలో ఆర్ఎల్ఎస్పీ, ఏఐఎంఐఎంలతో పాటు బీఎస్పీ, సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ జనతాదళ్(డెమొక్రాటిక్), జన్‌తాంత్రిక్ పార్టీ(సోషలిస్ట్)లు భాగస్వామ్యం వహిస్తున్నాయి.
ప్రచారానికి ఉద్ధవ్ ఠాక్రే
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు బిహార్‌లో ప్రచారం చేయనున్న 22 మంది పార్టీ నేతల జాబితాను శివసేన గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు సంజయ్ రౌత్ తదితరులున్నారు. బిహార్‌లో దాదాపు 50 స్థానాల్లో శివసేన పోటీకి దిగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎన్నికల బరిలో ఎన్సీపీ
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కూడా పోటీకి సిద్ధమవుతోంది. శరద్ పవార్ సహా 40 మందితో కూడిన ప్రచార సారథుల జాబితాను ఆ పార్టీ గురువారం విడుదల చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థలు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రచార సారథుల్లో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ఎంపీలు ప్రఫుల్ పటేల్, సుప్రియా సూలే తదితరులున్నారు.
42 మందితో ఎల్జేపీ జాబితా
బిహార్ ఎన్నికల్లో తలపడనున్న లోక్‌జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) 42 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం విడుదల చేసింది. వీరంతా తొలిదశ ఎన్నికల్లో పోటీచేస్తున్నవారే. భాజపా నుంచి ఎల్జేపీలో చేరిన కొందరు నేతలకు ఈ జాబితాలో చోటు దక్కింది. వీరిలో కొద్ది రోజుల క్రితమే ఎల్జేపీలో చేరిన కీలక నేతలు ఉషా విద్యార్థి, రాజేంద్ర సింగ్, రామేశ్వర్ చౌరాసియా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూపై ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ మరోసారి ధ్వజమెత్తారు. ఆ పార్టీ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించారు. జేడీయూను ఓడించాలని పిలుపునిచ్చారు.
చిరాగ్ లేఖ..
బిహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని ఎన్డీఏను వీడటానికి ముందే లోక్ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ భాజపాకు తెలియజేశారు. ఈ మేరకు అనేక అంశాలను వివరిస్తూ చిరాగ్ లేఖ రాశారు. ఆ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు.
ఇదీ చూడండి:బిహార్ బరి: కానిస్టేబుల్‌కు టికెట్.. డీజీపీకి నిరాశ!