కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను సీబీఐ అరెస్టు చేయడం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు కార్తీ చిదంబరం. ఐఎన్ఎక్స్ మీడియా ప్రమోటర్లు పీటర్, ఇంద్రాణీ ముఖర్జీలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
"నా తండ్రి పి.చిదంబరం అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ దిగజార్చడానికే ఈ కుట్ర చేశారు. మోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శ చేస్తున్న ఆయనను అడ్డుకోవడానికే ఈ ప్రయత్నం. సీబీఐ ఆయనను అరెస్టు చేయడం వెనుక ఎలాంటి న్యాయపరమైన ఆధారం లేదు. ఇది పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించడమే. "- కార్తీ చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం కుమారుడు
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో... తన తండ్రి చిదంబరం మీదకానీ, తనపైన కానీ.. సీబీఐ, ఈడీ ఎలాంటి కేసులు నమోదు చేయలేదని కార్తీ తెలిపారు. సీబీఐ, ఈడీ తమకు చాలా సార్లు నోటీసులు ఇచ్చిందని, తాము విచారణకు సహకరించామని ఆయన వెల్లడించారు. దాక్కోవలసిన అవసరం తన తండ్రికి లేదని స్పష్టం చేశారు.
సీబీఐ అదుపులో చిదంబరం
నాటకీయ పరిణామాల మధ్య నిన్న కాంగ్రెస్ నేత చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఉన్నారు. ఆయనని సీబీఐ అధికారులు ఐఎన్ఎక్స్ మీడియా కేసు విషయమై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చిదంబరం రాత్రి భోజనం చేయలేదు. ఉదయం అల్పాహారం తీసుకున్నారు.
ఇదీ చూడండి: నష్టాల పరంపర: మరింత దిగువకు స్టాక్స్ సూచీలు