ప్రపంచ క్షేమాన్ని కాంక్షించడం భారతీయ విధానం కాగా.. తన అధికార పరిధిని విస్తరించుకోవటమే చైనా లక్ష్యమని ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చైనా తరహాలో సామ్రాజ్య విస్తరణ, విదేశీ భూభాగాల ఆక్రమణ భారత సంస్కృతిలో భాగం కాదని.. పొరుగు దేశాలకు భారత్ పట్ల అభద్రతా భావం లేదని కేంద్ర మంత్రి అన్నారు. ‘‘రామ్ మందిర్ టు రాష్ట్ర మందిర్’’ అనే ఆన్‌లైన్ పుస్తకావిష్కరణ సందర్భంగా గడ్కరీ ప్రసంగించారు.
గల్వాన్‌లో ఇటీవల చోటుచేసుకున్న భారత్-చైనా ఘర్షణల నేపథ్యంలో నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. సామ్రాజ్య విస్తరణ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ సంస్కృతిలో భాగం కాదన్నారు. ప్రపంచమంతా క్షేమంగా ఉండాలనుకోవటం తమ దేశ చరిత్ర, సంస్కృతుల వారసత్వంగా లభించిందని ఆయన వెల్లడించారు. ఇతర దేశాలను ఆక్రమించే సామ్రాజ్యవాదం భారత వైఖరి కాదని మంత్రి స్పష్టం చేశారు.
అమిత శక్తి సామర్ధ్యాలున్నప్పటికీ భారత్ పట్ల భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలు ఎప్పుడూ అభద్రతా భావానికి లోనుకాలేదన్నారు. అదే చైనా విషయంలో వాటికి ఆ నమ్మకం లేదని.. అసలు చైనా అభివృద్ధే దురాక్రమణలపై ఆధారపడి ఉందని సీనియర్ భాజపా నేత అన్నారు. తమను తాము అధికులుగా భావించుకునే చైనా.. తమ శక్తితో ప్రపంచాన్నే ఆక్రమించుకోవాలనుకుంటోందని నితిన్ గడ్కరీ వివరించారు. ప్రపంచానికే మార్గదర్శకం కాగల సత్తా భారత్ స్వంతమని.. 21వ శతాబ్దం భారత్‌దే అన్న స్వామి వివేకానంద వాక్కులు తమకు ఆదర్శమన్నారు.
ఇదీ చదవండి- 'అమెరికా పొత్తు మంచిది కాదు- చైనాతో చర్చలు సాగించండి'