గంగాజలంతో కరోనా బాధితులకు చికిత్సపై క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిరాకరించింది. జల్‌శక్తి మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనలపై శాస్త్రీయ రుజువులు, సమాచారం బలంగా లేవని ఐసీఎంఆర్ ప్రతిపాదనల విభాగం అధ్యక్షుడు వైకే గుప్తా స్పష్టం చేశారు.
"ప్రస్తుతం వస్తోన్న ఇటువంటి ప్రతిపాదనలకు చాలా శాస్త్రీయ రుజువులు, సమాచారం, నేపథ్య పరిశీలన చాలా అవసరం. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖకు తెలియజేశాం."
- వైకే గుప్తా
జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అనుబంధంతో పనిచేస్తోన్న 'గంగా ప్రక్షాళన జాతీయ మిషన్' (ఎన్ఎంసీజీ)కి చాలా ప్రతిపాదనలు వచ్చాయి. గంగానీటితో కరోనాకు చికిత్స చేసే విధానాన్ని పరీక్షించాలని ప్రజలతోపాటు పలు ఎన్జీఓలు కూడా కోరాయి. వీటిని యథాతథంగా ఐసీఎంఆర్‌కు బదిలీ చేసింది జల్‌శక్తి శాఖ.
ఈ విషయానికి సంబంధించి జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్, పరిశోధన సంస్థ (ఎన్ఈఈఆర్ఐ)తో చర్చించామని ఎన్ఎంసీజీ తెలిపింది. గంగా నది లక్షణాలు, నీటి నాణ్యతలపై ఈ సంస్థ ఇదివరకు పరిశోధనలు చేసింది.
వ్యాధికారిక సూక్ష్మక్రిములను సంహరించే బ్యాక్టీరియోఫేజెస్ను గంగా నీటిలో ఉన్నాయని ఈ పరిశోధన గుర్తించింది. వీటినే నింజా వైరస్‌గా వ్యవహరిస్తారు.
ప్రతిపాదనలు ఇవే..
ఎన్ఎంసీజీకి వచ్చిన ప్రతిపాదనల్లో స్వచ్ఛమైన గంగా నీటిలో రోగనిరోధక శక్తిని పెంచే అవకాశాలు ఉన్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. గంగా నీటిలో వైరస్ వ్యతిరేక లక్షణాలపై పరిశోధించాలని కోరారు.
అయితే ఇందుకు ఈ ప్రతిపాదనలకు సంబంధించి ఐసీఎంఆర్ నుంచి తమకు ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదని ఎన్‌ఎంజీసీ అధికారులు తెలిపారు.