ముఖ్యమంత్రి పీఠంపై భాజపా-శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభన వల్ల మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 50-50 ఫార్ములాపై ఇరు పార్టీ నేతల వ్యాఖ్యలూ ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాల మధ్య సంధి కుదిరినట్టు కనపడుతోంది. సీఎం పదవిని చెరి సగం చేసుకుంటేనే కమల దళానికి మద్దతిస్తామన్న శివసేన.. ఈ అంశంపై ఇప్పుడు కొంత శాంతిచినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం.
భాజపా నేతృత్వంలోని కూటమిలో ఉండటం శివసేనకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు రౌత్. కానీ అత్మగౌరవం దెబ్బతినకూడదన్నారు. ప్రభుత్వ స్థాపనకు తొందరేమీ లేదన్న రాజ్యసభ ఎంపీ.. నూతన మంత్రి మండలి ఏర్పాటు ఆలస్యమైతే భాజపాతో శివసేన తెగతెంపులు చేసుకుంటుందన్న వార్తలను కొట్టిపారేశారు.
"వ్యక్తులు ముఖ్యం కాదు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రాధాన్యం. నిర్ణయాలను ఎంతో శాంతిగా, మహారాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శివసేనను వీడరు. ఎమ్మెల్యేలతో ఎలాంటి ఇబ్బందులు లేవు."
--- సంజయ్ రౌత్, శివసేన ఎంపీ.
భాజపా శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడణవీస్‌ను మరోసారి ఎన్నికవడంపై స్పందించిన రాజ్యసభ ఎంపీ... 145మంది ఎమ్మెల్యేల మద్దతున్న వారే ముఖ్యమంత్రి పదవిని చేపట్టగలరన్నారు.