ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 44 మంది మృతి చెందారు. 70 లక్షలమందిపై వరదల ప్రభావం పడింది. అసోం, బిహార్ రాష్ట్రాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది.
అసోంలో కొనసాగుతున్న వరుణుడి బీభత్సం
అసోంలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 30 జిల్లాల్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. 4157 గ్రామాలు నీటమునిగాయి. 42.87 లక్షలమందిపై వరద ప్రభావం పడింది. 1, 53, 211 హెక్టార్ల వ్యవసాయ భూమి జలమయమయింది.
తాజా పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి చరవాణి ద్వారా సీఎం సర్బానంద సోనోవాల్ వివరించారు. అవసరమైన సహకారాన్ని కేంద్రం అందిస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు మోదీ.
వరదల ప్రభావం కారణంగా రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, సహా వివిధ ప్రజా ఆస్తులు ధ్వంసమయ్యయాయి. తీవ్రమైన వరద కారణంగా ఉదల్గురి, బార్పేట, సోనిత్పుర్లలో భూమి పెద్ద మొత్తంలో కోతకు గురయ్యింది.
బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
70 శాతం నీట మునిగిన కజిరంగ
వరదలతో అసోంలోని కజిరంగ జాతీయ పార్కు 70 శాతం నీట మునిగింది. జాతీయ రహదారిపై అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వన్య ప్రాణులను వేటగాళ్లు చంపేందుకు యత్నించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
బిహార్లో వరద బీభత్సం
బిహార్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకూ 24మంది ప్రాణాలు కోల్పోయారు. 25.66 లక్షలమందిపై వరద ప్రభావం పడింది. భాగ్మతి, కమ్లా బాలన్, లాల్బకేయ, అధ్వారా, మహానంద నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉధ్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
సుపాల్, అరారియా, కిషన్జీ, పుర్నేయా ప్రాంతాల్లో భాగమతి నది ఉధ్ధృతమైంది. బిహార్లో 25,66, 100మంది వరదల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
సుపాల్, అరారియా, కిషన్గంజ్, పుర్నేయా, కథియార్ జిల్లాల్లో నేడూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 1,06,953 మందికోసం 644 భోజన శాలలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: కర్ణాటకీయం: కుమార 'పరీక్ష'కు ఎమ్మెల్యేల గైర్హాజరు?