దేశాభివృద్ధిలో భద్రత అత్యంత కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. భద్రత విషయంలో నూతన ప్రమాణాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సరైన భద్రతా వ్యవస్థ లేకుంటే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే భారత స్వప్నం... సాకారం కాదని అభిప్రాయపడ్డారు. దిల్లీలో జరిగిన 'బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్' 49వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో షా ప్రసంగించారు.
వాటికి కాలం చెల్లింది...
విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఫోన్‌ట్యాపింగ్ వంటి వాటికి కాలం చెల్లిందని షా పేర్కొన్నారు. ఇందుకోసం శాస్ర్తీయ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. దర్యాప్తు ప్రక్రియలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని తెలిపారు.
"మోదీ దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారు. ప్రపంచంలో టాప్3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను ఉంచాలని యత్నిస్తున్నారు. మోదీ నేతృత్వంలో దేశం ఆ స్థితికి చేరుకుంటుందని మనందరికీ భరోసా ఉంది. అక్కడికి చేరాలంటే దేశ భద్రత చాలా ముఖ్యం. అది అంతర్గత భద్రత అయినా లేదా బహిర్గత భద్రత అయినా. అంతర్గత భద్రత విషయంలో మనకు ప్రస్తుత తరంలో అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకపోతే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్నాన్ని సాకారం చేసుకోవడం మనకు సాధ్యంకాదు."
- అమిత్‌షా, కేంద్ర హోం మంత్రి
- ఇదీ చూడండి: అంతర్జాతీయ నైపుణ్యత పోటీల్లో మెరిసిన భారత్