ఏడాదిగా విద్యుత్ సరఫరా లేని ఆ ప్రభుత్వ పాఠశాలకు ఏడో తరగతి చదువుతున్న చిన్నారుల కృషి వెలుగులు తీసుకొచ్చింది. మహారాష్ట్ర బీడ్ జిల్లా కుర్లా ప్రాంతంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు ఏడాదిగా విద్యుత్ సేవలు నిలిపి వేసింది విద్యుత్ శాఖ. సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులు అతుల్ ఆరేయ్, శుభమ్ పాటిల్, పవన్ లాండ్జే, అజిజ్ షేక్.. ఉపాధ్యాయుల సూచన మేరకు పవన విద్యుత్, సోలార్ విద్యుత్ జనరేషన్ ప్రాజెక్టును చేశారు. ఇందుకు అయిన రూ.5000 ఖర్చును ఉపాధ్యాయులు భరించారు. ఈ ప్రాజెక్టు సఫలం కావడం వల్ల ఏడాది తర్వాత పాఠశాలకు విద్యుత్ వచ్చింది. అంతేకాకుండా ఏడాదిగా విద్యుత్ లేక పక్కన పెట్టిన టీవీ, స్పీకర్లు ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నాయి.
" రూ. 20 వేల విద్యుత్ బిల్లు రాగా దాన్ని చెల్లించకపోవడం వల్ల పాఠశాలకు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. అందుకు విద్యుత్ వచ్చేలా ఓ ప్రాజెక్టు చేయమని విద్యార్థులకు సూచించాం. ఆన్లైన్లో దీని పరిష్కారం కోసం వెతికాం. కానీ అది చాలా ఖరీదుతో కూడుకుందని విడిచిపెట్టాం. ప్రస్తుతం మా విద్యార్థులు చేసిన ఈ ప్రాజెక్టు తక్కువ ఖర్చుతోనే పూర్తయింది. విద్యార్థులకు సహకరించిన ఇతర ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు."
--- బహుసాహెబ్ రానె, ఉపాధ్యాయుడు
సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులను తయారు చేసి ఆకట్టుకున్నారు. సర్.సీవీ రామన్ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28న కనుగొన్నారు. ఈ ప్రయోగానికి గాను 1930లో రామన్‌కు నోబెల్ బహుమతి కూడా వచ్చింది. అందుకే ఫిబ్రవరి 28ని సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.
ఇదీ చదవండి: భూఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదమేదీ?