జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. వైద్యవిద్యా రంగాన్ని పూర్తిగా సంస్కరించే దిశగా భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును సభలో ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎలాగైనా ఈ బిల్లును ఆమోదించాలని చూస్తోంది.
భారతీయ వైద్య మండలి చట్టం-1956ను రద్దు చేసే దిశగా ఈ బిల్లును ప్రతిపాదిస్తోంది. ఎంసీఐ నియంత్రణలోని వైద్య కళాశాలలు లోపభూయిష్టంగా ఉన్నాయని.. అవినీతిమయం అయ్యాయని బిల్లు పేర్కొంటోంది.
వైద్య విద్యా రంగంలో మెరుగైన సంస్కరణల కోసం ఈ బిల్లు ఎంతో తోడ్పడుతుందని లోక్‌సభలో పేర్కొన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. ఈ నూతనంగా రూపొందిన ఎన్ఎంసీ బిల్లుతో.. భవిష్యత్తులో వైద్య విద్యా రంగంలో సవాళ్లను దీటుగా ఎదుర్కోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.
పేదలకు చేయూత..
బిల్లు పేదలకు అనుకూలంగా ఉంటుందని... ప్రభుత్వ సీట్లు మాత్రమే కాకుండా మిగతా సగం ప్రైవేటు సీట్లలో 'ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విభాగం'లోనూ ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. ఐఎంఏ స్థానంలో ఎంసీఐని తీసుకొస్తున్నందుకు రేకెత్తుతున్న అనుమానాలు, ఆందోళనలపై స్పందించారు మంత్రి. సంస్కరణలకు సంబంధించి ఈ బిల్లు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
ఐఎంఏ నిరసనలు..
భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ)ని తీసుకురావడాన్ని నిరసిస్తూ 5వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు నిరసన తెలిపారు. బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ర్యాలీగా వెళ్లి నిర్మాణ్ భవన్‌ను ముట్టడించారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.