ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని పూర్తిగా అంతం చేసే వ్యాక్సిన్ ఇంకా వెలువడలేదు. కానీ, ఈ ప్రమాదకరమైన వైరస్‌ను ఉన్నచోటే కదలనీయకుండా చేసి.. వ్యాప్తిని తగ్గించే సాంకేతికతను కనుగొన్నారు కర్ణాటక పరిశోధకులు. కొవిడ్-19కు చెక్ పెట్టే సరికొత్త 'నానో ప్లాస్టిక్ షీట్లు' తయారు చేశారు.
మంగళూరు, శిమొగ్గ పట్టణం మాచెనహల్లి పారిశ్రామిక ప్రాంతంలోని బాలాజీ పాలీప్యాక్ యాడ్-నానో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. కరోనాను అంతం చేసేందుకు నానో టెక్నాలజీని వినియోగించింది. సంస్థలోని పరిశోధకులు వినయ్ ఆయన బృందంతో కలిసి తొలుత ఈ అంశంపై పరిశోధన ప్రారంభించారు.
కరోనా వైరస్ ప్లాస్టిక్ మీద 3 రోజుల వరకు సజీవంగా ఉంటుంది. చెక్క, అద్దంపై నాలుగు రోజులు, ఇతర లోహాలపై 5 రోజుల వరకు సజీవంగా ఉంటుంది. కానీ, నానో సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన ఈ షీటు మీద.. కరోనా వైరస్ కదలకుండా ఉన్నచోటే అతుక్కుపోతుంది. కాబట్టి ఈ షీటుపై కేవలం 2 గంటల 54 నిమిషాల్లోనే వైరస్ అంతం అవుతుంది.
70 మైక్రాన్లు కంటే కాస్త మందంగా ఉండే ఈ షీట్లతో.. పీపీఈ కిట్లు, దుప్పట్లు, తలగడలు, కర్టెయిన్లు, నేలపై పరిచే మ్యాట్లు తయారు చేశారు పరిశోధకులు. వీటిని ఆసుపత్రులు, ఇళ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వినియోగిస్తే కరోనా సోకే ప్రమాదాన్ని దాదాపు తగ్గించొచ్చు అంటున్నారు.
మూడు గంటల్లోనే కరోనాపై ఉన్న ప్రోటీన్‌ను నాశనం చేసి, వైరస్‌ను అంతం చేయగల ఈ షీట్లను.. పరీక్షలకు పంపాల్సిందిగా కోరింది ఐసీఎంఆర్. అధికారిక ధృవీకరణ పొందాక మరో నెల రోజుల్లో తమ ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తామన్నారు బాలాజీ పాలీప్యాక్ అధికారులు.
ఇదీ చదవండి: కూలిన వంతెన- ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ముప్పు