2002 గుజరాత్ అల్లర్లపై విచారణ జరిపిన నానావతి-మెహతా కమిషన్ తుది నివేదిక... ఆ శాసనసభ ముందుకు వచ్చింది. ఈ కమిషన్ ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి నివేదికను అందించగా.. తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రాష్ట్ర హోం మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా.
గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి, మంత్రి వర్గ సహచరులకు నానావతి కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. అల్లర్లు ఉద్దేశపూర్వకంగా జరిపించినవి కాదని స్పష్టం చేసింది.
పోలీసుల వైఫల్యం..
అయితే.. ఈ ఘటనలో పోలీసుల్ని తప్పుబట్టింది కమిషన్. అల్లర్లను నియంత్రించడంలో పోలీసుల అసమర్థత కనిపించిందని పేర్కొంది. తప్పనిసరి సమయంలో.. పోలీసు సిబ్బంది వేగంగా స్పందించలేకపోయారని, అల్లర్లను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేయలేదని చురకలంటించింది. అసమర్థత చూపిన పోలీసు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది.
గోద్రా ఘటన అనంతరం.. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
గోద్రా అల్లర్లు
2002లో గోద్రా రైల్వే స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీలు దగ్ధమై.. 59 మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం.. గుజరాత్లో మత ఘర్షణలు, అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు... అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నానావతి కమిషన్‌ను నియమించారు.