తూర్పు లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో జూన్ 15న చైనా సైన్యంతో భీకరంగా పోరాడి అమరులయ్యారు 20 మంది భారత జవాన్లు. వీరి పేర్లను దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంపై లిఖించనున్నట్లు తెలిపారు అధికారులు. కొద్ది నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో కర్నల్ బి.సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాలు మూడు సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి భేటీలు నిర్వహించాయి. ఉద్రిక్త ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణకు అంగీకరించాయి.
గల్వాన్ లోయ ఘటనలో తమ సైనికులు ఎంతమంది చనిపోయారనే విషయాన్ని మాత్రం చైనా ఇప్పటివరకు వెల్లడించలేదు. దాదాపు 35 మంది మరణించి ఉంటారని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి.