అమెరికా అధ్యక్షుడు కాకముందు.. ఆయనొక విజయవంతమైన వ్యాపారి. ఎక్కడ కాలు మోపితే అక్కడ డాలర్ల వర్షం కురిసేది. విలాసవంతమైన జీవితం ఆయన సొంతం. ఆస్తులే కొలమానమైతే ఆయన అపర కుబేరుడు. ఆయనే డొనాల్డ్ ట్రంప్. ఆయన వ్యాపారాలు, ఆస్తుల గురించి తెలుసుకుందామా?
1968లో అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు ట్రంప్. ఆయన తండ్రి ఫ్రెడరిక్ ట్రంప్ ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి. చదువులు పూర్తయిన తర్వాత తన తండ్రి ఫ్రెడరిక్ బాటలోనే.. ట్రంప్ స్థిరాస్తి వ్యాపారాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు.
అమెరికాతో పాటు, మరికొన్ని దేశాల్లో అంచెలంచెలుగా విస్తరించారు. భారత్‌లోని పుణెలోనూ ట్రంప్‌నకు స్థిరాస్తి వెంచర్లున్నాయి. ఆయన వ్యాపార సామ్రాజ్యంలో ముఖ్యమైనవి..
⦁ ద ట్రంప్ ఆర్గనైజేషన్
⦁ ట్రంప్ టవర్
⦁ అట్లాంటిక్ సిటీలో కాసినోలు
⦁ ద అప్రెంటిస్(ఎన్‌బీసీ)
⦁ మిస్‌యూనివర్స్ లాంటి టీవీ ఫ్రాంచైజీలు
ఇవే కాకుండా జావిట్స్ సెంటర్, న్యూయార్క్‌లోని గ్రాండ్ హయత్ లాంటి అతిపెద్ద హోటళ్ల వ్యాపారంలోనూ ఆయనకు భాగస్వామ్యం ఉంది.
ఆస్తులు...
⦁ ఫ్లోరిడాలో అతిపెద్ద గోల్ఫ్‌కోర్స్
⦁ పామ్‌బీచ్‌లో ఓ ఎస్టేట్
⦁ బోయింగ్ 757 విమానం
⦁ ఎస్-76 హెలికాప్టర్
⦁ విలాసవంతమైన నౌక
⦁ బంగారంతో చేసిన బైక్
ట్రంప్ తన పేరిట ఓ విశ్వవిద్యాలయాన్నీ స్థాపించారు. ట్రంప్ ఆస్తుల విలువ 310 కోట్ల డాలర్లు అని ఫోర్బ్స్ లెక్కగట్టింది. 870 కోట్ల డాలర్ల దాకా ఉండొచ్చని ఇంకొందరు చెబుతుంటారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా ఎదగాలో చెబుతూ.. 'ఆర్ట్ ఆఫ్ ద డీల్' పేరుతో ఆయనో పుస్తకం రాశారు. ట్రంప్ కంపెనీలపై పలు కేసులు కూడా ఉన్నాయి.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అమెరికా నుంచి 7 విమానాలు- వాటిలో ఏముంటాయ్?