రాజ్యసభ 250వ సమావేశం జరగనున్న ఒకరోజు ముందు అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు పెద్దల సభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పలు అంశాలపై చర్చించారు. పార్లమెంటరీ స్థాయి సంఘాల్లోని సభ్యుల గైర్హాజరుపై ఆందోళన వ్యక్తం చేశారు.
"కమిటీల స్థాయి తగ్గేల మనం ప్రవర్తించకూడదు. కమిటీ సభ్యులు విధిగా హజరయ్యేలా అఖిలపక్ష నేతలు చర్యలు తీసుకోవాలి. ఎంపీలందరూ సక్రమంగా హాజరైనప్పుడే.. వాటి విధులను సక్రమంగా నిర్వర్తిస్తాయి."
- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.
దిల్లీలోని కాలుష్యంపై చర్చించేందుకు 28 మంది సభ్యులు ఉన్న పట్టణ అభివృద్ధి కమిటీ సమావేశంలో.. కేవలం నలుగురు హాజరయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఈ విధంగా స్పందించారు ఉపరాష్ట్రపతి. ఈ సమావేశానికి కమిటీలో దిల్లీ నుంచి ఉన్న ఒకే ఒక్క ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా హాజరు కాలేదు.
పార్లమెంటరీ ఛానల్స్‌పై కమిటీ..
పార్లమెంటరీ ఛానల్స్ లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు వెంకయ్య. పార్లమెంటరీ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసి, ప్రేక్షకుల సంఖ్యను పెంచడమే ఈ కమిటీ లక్ష్యమని పేర్కొన్నారు.
పుస్తకం ఆవిష్కరణ..
1952 నుంచి రాజ్యసభ ప్రయాణంపై ప్రచురించిన 'రాజ్యసభ..ది జర్నీ సిన్స్ 1952' పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలి పుస్తకాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ ఆజాద్‌కు అందజేశారు.
నాణెం, తపాలా బిళ్ల..
రాజ్యసభ 250వ సమావేశాన్ని పురస్కరించుకుని రూ.250 వెండి నాణెం, తపాలా బిళ్లను రేపు విడుదల చేయనున్నట్లు తెలిపారు వెంకయ్య. 'భారతీయ రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర: సంస్కరణలు' అంశంపై తొలిరోజు చర్చించనున్నారు.