నూతన జాతీయ పార్టీ కార్యవర్గ బృందాన్ని ప్రకటించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. పాతవారిలో కొందరిని అదే పదవిలో కొనసాగించగా.. మరికొందరిని ఇతర స్థానాల్లోకి బదిలీ చేశారు.
కీలకమైన ప్రధాన కార్యదర్శుల స్థానాల్లో ఐదుగురు కొత్తవారికి స్థానం కల్పించారు నడ్డా. రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకత్వం మధ్య సంబంధాల విషయంలో ఈ కార్యదర్శులే కీలకంగా వ్యవహరిస్తారు. ఈ కొత్త వారిలో భూపేందర్ యాదవ్, అరుణ్ సింగ్, కైలాశ్ విజయ్వర్గియా ఉన్నారు. రామ్ మాధవ్, పీ మురళీధర్ రావు, సరోజ్ పాండే, అనిల్ జైన్ల స్థానంలో కొత్తవారికి అవకాశమిచ్చారు. వీరిని తొలగించి దుశ్యంత్ కుమార్ గౌతమ్, డీ పురందేశ్వరీ, సీటీ రవి, తరుణ్ ఛుగ్, దిలీప్ సైకియాలను నియమించారు.
మరోవైపు యువ ఎంపీ తేజస్వీ సూర్యను.. పార్టీ యువ విభాగం అధ్యక్షుడిగా ఎంపిక చేశారు నడ్డా. పార్టీ అధికార ప్రతినిధుల జాబితాను 23కు పెంచారు. ఎంపీ అనిల్ బలునీని ప్రార్టీ ప్రధాన ప్రతినిధిగా ఎంపిక చేశారు.
మోదీ స్పందన
పార్టీ విడుదల చేసిన కొత్త కార్యవర్గ సభ్యులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో నిస్వార్థ సేవ చేసే పార్టీ సంస్కృతిని సభ్యులు కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పేదలు, అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనం కలిగే విధంగా కృషిచేయాలని అభిలషించారు.