ఉత్తర్ప్రదేశ్ ముజఫర్నగర్ కతౌలీ తెహ్సిల్ జిల్లా ఫ్యామిలీ కోర్టు.. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ ప్రభుత్వ ఉద్యోగినిని ఆదేశించింది. దాదాపు 9 సంవత్సరాల విచారణ తరువాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే నెలకు 2వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.
కిషోరీలాల్ సోహుంకర్, మున్నాదేవీలకు 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దంపతులు 10ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మున్నాదేవీ కాన్పూర్లోని భారత ఆర్మీలో నాలుగో గ్రేడ్ ఉద్యోగినిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఆమెకు నెలకు 12వేల పింఛను వస్తోంది. కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతున్నాడు. అతని పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పింఛనులో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్నగర్లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పును వెలువరించింది.
"కోర్టు తీర్పుతో నాకు తృప్తి కలగలేదు. దాదాపు 9ఏళ్ల తరువాత కోర్టు తీర్పును వెలువరించింది. నేను రుణం తీసుకొని ఈకేసు కోసం పోరాడాను. 20ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోంది. నాకు కేవలం రూ.2వేలు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కానీ ప్రస్తుతం నా భార్య పింఛను రూ.12వేల కంటే ఎక్కువే వస్తోంది."
---కిషోరీలాల్ సోహుంకర్.
కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్ అడ్వకేట్ బలేష్ కుమార్ తయాల్ తెలిపారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ మున్నీదేవి దానికి అంగీకరించలేదన్నారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.