భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 29 మరణాలు, 1,463 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో దేశంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 10,815కి చేరుకుంది. ప్రస్తుతం 9,279 యాక్టివ్ కేసులుండగా... 1,190 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ముంబయి అతలాకుతలం
ముంబయిలో ఇవాళ ఒక్కరోజే 18 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 350 మందికి వైరస్ సోకగా... మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 2,684కి పెరిగింది. 259 మంది కోలుకున్నారు.
బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా కేసులు, మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్క రోజే అక్కడ 11 మంది వైరస్తో మృతి చెందారు. పాల్ఘర్లో ఈ రోజు 11 కొత్త కేసులు నమోదు కాగా... ఆ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 53కి చేరింది.
గుజరాత్లో ఇద్దరు మృతి
గుజరాత్ రాష్ట్రంలో ఇవాళ ఇద్దరు మహమ్మారి బారిన పడి బలయ్యారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 28కి పెరిగింది.
తమిళనాట తగ్గిన కేసులు
తమిళనాడులో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ అక్కడ కేవలం 31 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో 21 మందికి తబ్లీగీ ప్రార్థనలతో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,204కి చేరింది. కాగా 81 మంది వ్యాధి నుంచి బాధితులు కోలుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో... తగ్గుముఖం
జమ్ముకశ్మీర్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కేవలం 8 కొత్త కేసులు మాత్రమే నమోదుకాగా... 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం అక్కడ మొత్తం కేసుల సంఖ్య 278గా ఉంది.
మూడేళ్ల పసిపాపలకు కరోనా
ఆంధ్రప్రదేశ్‌లో 80 ఏళ్ల వృద్ధురాలికి సహా మూడేళ్లు వయస్సు గల ఇద్దరు చిన్నారులకు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 473 కరోనా కేసులు నమోదయ్యాయి.
కేరళలో 173 యాక్టివ్ కేసులు
కేరళలో ఈ రోజు 8 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 13 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 173 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
కర్ణాటకలో 10కి చేరిన మరణాలు
కర్ణాటకలో ఇవాళ 76 ఏళ్ల ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 10కి చేరింది. అలాగే రాష్ట్రంలో 11 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. కర్ణాటకలో ఇప్పటి వరకు 260 పాజిటివ్ కేసులు నమోదవ్వగా... 71 మంది కోలుకున్నారు.
బంగాల్: గత 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 120కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏడుగురు కరోనాకు బలయ్యారు.
ఉత్తర్‌ప్రదేశ్: ఇవాళ కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీనితో మొత్తం మరణాలు సంఖ్య 8కి పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో 102 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 660కి చేరింది.
ఒడిశా: ఒడిశాలో 5 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 60కి చేరింది.
హరియాణా: ఫరీదాబాద్‌లో కొత్తగా 2 పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 184కి పెరిగింది. ప్రస్తుతానికి 41 మంది ఆరోగ్యం బాగుపడి డిశ్చార్జ్ కాగా.. 141 మంది కరోనాతో పోరాడుతున్నారు.
పంజాబ్: ఎనిమిది కొత్త కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో మొత్తం కేసుల సంఖ్య 184కి పెరిగింది. మరో వైపు జలంధర్‌లో ఓ వ్యక్తి కరోనాతో మరణించాడు. దీనితో మృతుల సంఖ్య 13కి పెరిగింది.
ఉత్తరాఖండ్: ఈ రోజు 2 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 37కు చేరుకుంది. 9 మంది మాత్రం కోలుకున్నారు.
ఝార్ఖండ్: ఇవాళ రాష్ట్రంలో 3 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 27కి పెరిగింది.
ఇదీ చూడండి: రోడ్లపైకి భారీగా వలస కార్మికులు- పోలీసుల లాఠీఛార్జ్