కేరళ ఇడుక్కి జిల్లాలో ఉన్న ముల్లపెరియార్ ఆనకట్ట అరుదైన ఘనతను సాధించింది. పెరియార్, ముల్లై నదులలోని అదనపు నీటిని తమిళనాడులో నీటి కొరత ఉన్న జిల్లాలకు మళ్లించేందుకు నిర్మించిన ఈ జలాశయం శనివారంతో 125 వసంతాలు పూర్తి చేసుకుంది. 1887లో డ్యాం నిర్మాణం ప్రారంభం కాగా.. 1895 అక్టోబర్ 10న అప్పటి మద్రాస్ గవర్నర్ ఈ ఆనకట్టను ఆవిష్కరించారు.
నీటి పంపకం విషయంలో 1884 సంవత్సరంలో ట్రావెన్కోర్ సంస్థానం, మద్రాస్ ప్రావిన్స్ మధ్య చర్చలతో జలాశయ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. రెండేళ్ల తర్వాత చర్చలు ముగిశాయి. 1886లో ఒప్పందం కుదిరింది. పెరియార్ నదికి అడ్డంగా ఆనకట్ట నిర్మించాలని ఇరుపక్షాలు అంగీకరానికి వచ్చాయి. ఈ ఒప్పందం కాల వ్యవధి 999 ఏళ్లు. మరో 874 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది.
ట్రావెన్కోర్ పాలకుడు తిరునాల్ రామవర్మ ఆదేశాల ప్రకారం డ్యాం నిర్మాణం కోసం సముద్ర మట్టానికి 155 అడుగులు ఎత్తులో ఉన్న 8 వేల ఎకరాలతో పాటు మరో 100 ఎకరాలను లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం భూమిపై మద్రాస్ పాలక యంత్రాంగానికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవు. లీజు అగ్రీమెంటు ప్రకారం ఎకరానికి రూ.5 చొప్పున ట్రావెన్కోర్ రాష్ట్రానికి ఏటా చెల్లించాల్సి ఉంటుంది.
వివాదం
ముల్లపెరియార్ డ్యాం విషయంలో కేరళ, తమిళనాడు మధ్య ఎన్నోసార్లు వివాదాలు తలెత్తాయి. డ్యాం భద్రతపై ఆందోళనలు, నీటి మట్టం స్థాయి విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు వీటికి కారణమయ్యాయి.
1979లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడం వల్ల డ్యాంలో నీటి లీకేజీ సమస్య బయటపడింది. దీంతో వివాదం ప్రారంభమైంది. ఆనకట్టను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పెరుమెడు ఎమ్మెల్యే సీఏ కురియన్ వండి పెరియార్లో నిరాహార దీక్ష చేశారు.
అనంతరం 1979 నవంబర్ 25న సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) డ్యాంను పరిశీలించింది. నీటి మట్టాన్ని 136 అడుగులకు తగ్గించాలని, ఆనకట్టను పునరుద్ధరించేందుకు స్వల్ప, దీర్ఘకాల చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ సూచించింది.
కమిషన్ ఆదేశాల ప్రకారం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. డ్యాం స్పిల్‌వేలను 10 నుంచి 13కు పెంచారు. ఆనకట్ట పనులు పూర్తయిన తర్వాత నీటి మట్టాన్ని ఇంతకుముందున్న 152 అడుగుల స్థాయికి పెంచాలని తమిళనాడు డిమాండ్ చేసింది. భద్రతా సమస్యలు సహా వివాదం కోర్టులో ఉందన్న కారణాలు చూపి తమిళనాడు డిమాండ్‌ను కేరళ వ్యతిరేకిస్తోంది.
ఈ వివాదం మొదట కేరళ, తమిళనాడు రాష్ట్రాల హైకోర్టులలో సాగింది. ఈ కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత ధర్మాసనాన్ని తమిళనాడు అభ్యర్థించింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది.
'కేరళకు భద్రత, తమిళనాడుకు నీరు' అనే నినాదం ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో వినిపిస్తూనే ఉంది.