మధ్యప్రదేశ్‌లో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమవడం కలకలం రేపింది. అయితే.. అదృశ్యమైన ఎమ్మెల్యేలు బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. వీరంతా బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఓ రిసార్టులో ఉన్నట్లు తెలుస్తోంది.
వీరంతా కాంగ్రెస్ ముఖ్య నేత జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సింధియా ఫోన్ స్విచాఫ్ వస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదృశ్యమైన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారనీ.. వీరంతా చార్టర్ విమానంలో బెంగళూరుకు చేరుకున్నట్టు సమాచారం.
మెజార్టీ అంతంతమాత్రమే..
బొటాబొటీ మెజార్టీతోనే 15 నెలలుగా నెట్టుకొస్తున్న కమల్‌నాథ్ ప్రభుత్వానికి సొంత పార్టీకి చెందిన యువ నేత జ్యోతిరాదిత్య సింధియా వైపు నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. సింధియాకు విధేయులుగా ఉన్న 17 మంది ఎమ్మెల్యేలే బెంగళూరుకు వెళ్లినట్టు సమాచారం.
భాజపా పావులు...
మరోవైపు ప్రతిపక్ష భాజపా కూడా ప్రభుత్వాన్ని అస్థిరతను అవకాశంగా మార్చుకోవాలని పావులు కదుపుతోంది. రేపు పార్టీ శాసనసభా పక్షం సమావేశం కానుంది. 17 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు అదృశ్యమైన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
సింధియా అసంతృప్తి...!
2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియాకు ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించినా.. చివరి నిమిషంలో ఆయనకు సీఎం పీఠం దక్కకుండా పోయిన విషయం తెలిసిందే.
అప్పటినుంచి ఆయన పలు సందర్భాల్లో తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో సింధియా పేరు ప్రాచుర్యంలోకి వచ్చినా తీరా.. ఫలితాలు వచ్చాక ఆ పదవిని సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అధిష్ఠానం కట్టబెట్టింది.
లెక్కల చిక్కులు...
ఈ నాటకీయ పరిణామాల మధ్య తాజాగా మరో 17 మంది ఎమ్మెల్యేలు కనబడకుండా పోవడం.. ఒక్కసారిగా మధ్యప్రదేశ్‌లో రాజకీయాన్ని వేడెక్కించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌కు 114 మంది అభ్యర్థుల బలమే కాకుండా.. ఎస్పీ, బీఎస్పీ, స్వతంత్రులతో కలిపి మరో ఏడుగురు సభ్యుల మద్దతు ఉంది. భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది.
- ఇదీ చూడండి: భారత్‌లో 45కు పెరిగిన కరోనా కేసుల సంఖ్య