ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల కొడుకు మృతదేహాన్ని ఒడిలో ఎత్తుకుని నాలుగు కిలోమీటర్లు నడిచింది ఓ తల్లి.
అంబులెన్స్ నిరాకరించడం వల్లే!
తొమ్మిదేళ్ల అఫ్రోజ్ తల్లిందండ్రులు షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్వాసులు. అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని షాజహాన్‌పూర్ జిల్లా అసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం బాలుడిని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అందుకు అవకాశం లేకుండానే... అఫ్రోజ్ జిల్లా ఆసుపత్రిలోనే మృతిచెందాడు.
పేదరికంలో జీవిస్తున్న అఫ్రోజ్ తల్లిదండ్రులకు అంబులెన్స్ సేవలు వినియోగించుకునే అంత స్తోమత లేదు. ఉచితంగా అంబులెన్స్ సమకూర్చాలని తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందిని అభ్యర్థించారు. కానీ వారు నిరాకరించారు. ప్రత్యామ్నాయం లేక కంటతడి పెట్టుకుంటూ తనయుడి మృతదేహాన్ని 4 కిలోమీటర్లు మోసుకెళ్లింది ఆ మాతృమూర్తి.
ఆస్పత్రి వర్గాల వాదన...
ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది స్పందించారు. తమ వద్ద ఉన్నప్పుడు రోగి బతికే ఉన్నాడని... వేరే ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించి ఉండొచ్చన్నారు.
"అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. లఖ్‌నవూలోని పెద్దాసుపత్రిలో చేర్చాలని సూచించాం. వేరే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్తామని బాలుడి తల్లిదండ్రులన్నారు. రోగి దారిలోనే మరణించి ఉండొచ్చు. ఘటన తర్వాత మృతుడి బంధువులు మా వద్దకు రాలేదు."
--- అనురాగ్ పరాసర్, అత్యవసర విభాగ వైద్యాధికారి.