పరస్పర అంగీకారంతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్-చైనా మధ్య మరిన్ని చర్చలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం. ఈ చర్చలు సైనిక, దౌత్యస్థాయిలో ఉంటాయని తెలుస్తోంది.
మంగళవారం కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరిగిన చర్చల్లో.. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించేందుకు కట్టుబడి ఉన్నామని ఇరు దేశాలు అంగీకరించినట్టు భారత సైనిక వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని దశల వారీగా తగ్గించాలని అధికారులు నిర్ణయించినట్టు స్పష్టం చేశాయి.
చైనా దుస్సాహసంతో...
వాస్తవాధీన రేఖ వెంబడి మే నెల నుంచి భారత సైనికులపైకి కయ్యానికి కాలుదువ్వుతోంది చైనా. ఇదే క్రమంలో గత నెల 15న గల్వాన్ లోయలో భారత జవాన్లపై దాడికి పాల్పడ్డారు చైనీయులు. ఈ ఘటనలో 20మంది భారతీయులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇప్పటివరకు సైనిక స్థాయిలో మూడుసార్లు చర్చలు జరిగాయి.