దేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. 5 రోజులు ఆలస్యంగా జూన్ 6న కేరళ తీరాన్ని తాకనున్నట్టు తెలిపింది. సాధారణంగా జూన్ 1న దేశంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంపై నైరుతి రుతుపవనాల ప్రభావం 4 నెలల పాటు ఉంటుంది.
అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ భాగం, ఆగ్నేయ బంగాళాఖాతంలో రుతుపవనాలు ముందస్తుగానే మే 18,19 తేదీల్లో వచ్చే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. రుతుపవనాల ప్రవేశం ఆలస్యం కావటం 2014 నుంచి ఇది మూడో సారి. ఆ ఏడాది జూన్ 5 న ప్రవేశించగా, 2015లో 6వ తేదీ, 2016లో 8వ తేదీన తీరాన్ని తాకాయి.
ప్రభావం తక్కువే!
వర్షపాతంపై రుతుపవనాల రాక ఆలస్యం ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని ఐఎండీ అధికారులు తెలిపారు. 2017లో మే 30న రుతుపవనాలు దేశంలో ప్రవేశించినా.. వర్షపాతం మాత్రం 95 శాతమే నమోదైంది. ఇది సాధారణంకన్నా తక్కువ.
ఈ ఏడాది దీర్ఘకాలిక సగటులో 96 శాతంతో దాదాపు సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్లో ఐఎండీ తెలిపింది.
స్కైమెట్ది మరో లెక్క
జూన్ 4న రుతుపవనాలు ప్రవేశిస్తాయని స్కైమెట్ వాతావరణ సంస్థ మంగళవారమే ప్రకటించింది. అయితే 93 శాతంతో లోటు వర్షపాతం నమోదవుతుందని ఆ సంస్థ అంచనా వేసింది.
ఇదీ చూడండి: వరుణుడి రాక ఆలస్యం- లోటు వర్షపాతం!