బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని శౌచాలయంలో లక్షల రూపాయల నగదును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో సోదాలు జరుగుతున్నాయి అని తెలిసిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి, అతని భార్య శౌచాలయంలో రూ.10 లక్షల నగదు వదిలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది..
చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారి అహ్మద్ మొహమ్మద్, అతని సతీమణి లఖ్‌నవూకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అతని భార్య సూట్ కేసుతో శౌచాలయంకు వెళ్లారు. అక్కడే తన వద్దన ఉన్న 10 లక్షల నగదును విసిరేశారు. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వహించే సీఐఎస్ఏపీ అధికారులకు అనుమానం వచ్చి.. దంపతుల వద్ద ఉన్న సూట్ కేసు తనిఖీ చేయగా అందులో రూ. 74,81,500 ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక అందులో 200 గ్రాముల బంగారం, ఖరీదైన ఫోన్లు, ఆపిల్ వాచ్‌లు, నెక్లెస్, అయిదు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం చూసిన అధికారులు ఒక్క క్షణం కంగుతిన్నారు.
నిందితులు వద్ద నుంచి మొత్తం సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.