ఉత్తర్ప్రదేశ్లో ఎస్పీ- బీఎస్పీ నేతృత్వంలో ఏర్పడిన మహాకూటమిలో చేరేందుకు కాంగ్రెస్కు ఆసక్తి లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు.
80 లోక్సభ స్థానాలున్న ఉత్తర్ప్రదేశ్లో ఒంటరిగానే పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. మహాకూటమి రెండు సీట్లు మాత్రమే కాంగ్రెస్కు కేటాయించినందున, ఒంటరి పోరు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మొయిలీ తెలిపారు.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు రెండు సీట్లు అనేది సరైన విషయం కాదు, అందుకే అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెడుతున్నాం. అయితే అభ్యర్థులను నిలబెట్టే విషయంలో కాంగ్రెస్కు, ఎస్పీ-బీఎస్పీకి అవగాహన కుదిరే అవకాశముంది. ఎందుకంటే వారి లక్ష్యమూ భాజపా ఓటమే- వీరప్ప మొయిలీ, సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్కు రెండు సీట్లు మాత్రమే కేటాయిస్తామని గతంలో ప్రకటించారు.
ఆమ్ఆద్మీతో చర్చలు
దిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీతో పొత్తుపై సమాలోచనలు జరుగుతున్నాయని మొయిలీ ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 పైగా సీట్లు గెలుస్తుందని మొయిలీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార కార్యక్రమాల వరకు ప్రియాంక ప్రత్యేత శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు.