సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసత్యాలు చెప్పి గెలిచారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కేరళ వయనాడ్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కల్పట్టాలో రోడ్ షో నిర్వహించారు.
"జాతీయ స్థాయిలో మేము విషంతో పోరాడుతున్నాం. నరేంద్ర మోదీ విషాన్ని ఉపయోగిస్తున్నారు. నేను పరుషమైన పదాన్ని వాడుతున్నా. ద్వేషం వంటి విషాన్ని ఉపయోగించి దేశాన్ని మోదీ విడదీయాలని చూస్తున్నారు. ఆయన కోపం, ద్వేషాన్ని ఉపయోగించి ప్రజలను విభజించాలని చూస్తున్నారు. అసత్యాలతో ఎన్నికల్లో విజయం సాధించారు. నరేంద్ర మోదీపై పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆయన ఉపయోగించే ద్వేషం, కోపం వంటి వాటిపైనా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆయన కోపం, ద్వేషం, అభద్రత, అసత్యాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
వయనాడ్ కలెక్టరేట్‌కు రాహుల్..
కల్పట్టాలో రోడ్ షో నిర్వహించే ముందు వయనాడ్ కలెక్టరేట్‌కు వెళ్లి 22 మంది వివిధ పార్టీ ప్రతినిధులను కలిశారు రాహుల్. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వారి అందించిన ఫిర్యాదులను స్వీకరించారు. నియోజకవర్గంలోని సమస్యలు అడిగి తెలిసుకున్నారు.
ఇదీ చూడండి: వయనాడ్‌లో రాహుల్ 'కృతజ్ఞతా' పర్యటన