కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మే 3 తర్వాత దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేసే అంశమై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నట్టు సమాచారం.
ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు పలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం ఇప్పటికే అనుమతులిచ్చింది. కానీ దేశంలో వైరస్ విజృంభిస్తున్న కారణంగా లాక్డౌన్ పొడింగిపునకే ఎక్కువ రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇది 4వసారి.
అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నందున.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మే 3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో కొనసాగింపే..!
దేశంలో కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో ఆంక్షల సడలింపుపై కేంద్రం ప్రకటన అనంతరమే నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. వచ్చేవారం నెలకొనే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న ముంబయి, పుణె, నాసిక్, నాగ్‌పుర్ వంటి పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
'దిల్లీలో కేంద్రం నిర్ణయం మేరకే'
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా మాత్రమే దిల్లీలో ఆంక్షలను అమలు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. హోంశాఖ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమన్నారు.
కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా లాక్డౌన్ కొనసాగించాలని ప్రధానిని కోరే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: వైరస్‌ను జయించిన వైద్యుడి 'ప్లాస్మా' దానం