కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మోదీతో పాటు కేంద్ర మంత్రులతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు.
బిమ్స్టెక్ దేశాధినేతలు, దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన అతిథులు, రాజకీయ, వ్యాపార, క్రీడా, సినీ ప్రముఖులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. భాజపా నేతలు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అట్టహాసంగా సాగింది ప్రమాణ స్వీకార కార్యక్రమం.
మంత్రుల ప్రమాణం
మోదీతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో కొందరు కొత్తవారికి అవకాశం ఇచ్చింది భాజపా అధిష్ఠానం.
కేబినెట్‌మంత్రులుగా 25 మంది, స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా 9మంది, కేంద్రసహాయ మంత్రులుగా 24మంది ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదీ చూడండి : మోదీ జట్టులోని కేంద్ర మంత్రులు వీరే..
ఎన్డీఏ భాగస్వామ్యపక్షం జేడీయూ... కొత్త కేబినెట్‌లో చేరలేదు.
బిమ్స్టెక్ దేశాధినేతల హాజరు
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్స్టెక్ దేశాల నేతలు విచ్చేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, కిర్గిస్థాన్ దేశాధ్యక్షులు అబ్దుల్ హమీద్, మైత్రిపాల సిరిసేన, యు విన్ మియంత్, భూటాన్ ప్రధాని లోటె షీరింగ్, సూరన్ బే జీన్ బెకోవ్, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, థాయ్‌లాండ్ ప్రత్యేక దూత గ్రిసాద బూన్‌రాచ్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరయ్యారు.
దేశ, విదేశాలకు చెందిన దాదాపు 8వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్రనేతల హాజరు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ముఖ్యమంత్రులు హాజరు
ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్ర, బిహార్, తమిళనాడు ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాత్, కుమారస్వామి, దేవేంద్ర ఫడణవీస్, నితీశ్ కుమార్, పళనిస్వామి హాజరయ్యారు. ఎన్డీఏ పక్షాల ముఖ్యనేతలు విచ్చేశారు.
వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు
ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి వ్యాపార, క్రీడా, సీని ప్రముఖులు హాజరయ్యారు. వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ దంపతులు, రతన్ టాటా విచ్చేశారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్, బాలీవుడ్ ప్రముఖులు కంగనా రనౌత్, బోనీ కపూర్ ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
నోబెల్ అవార్డు గ్రహీత
నోబెల్ శాంతి అవార్జు గ్రహీత కైలాశ్ సత్యార్థి ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేశారు.
ఇదీ చూడండి : సామాన్యుడి నుంచి శక్తిమంతమైన నేతగా...