జమ్ముకశ్మీర్ అంశంపై తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. జమ్ముకశ్మీర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోని సుందర ప్రదేశాలకు ప్రపంచ పర్యటక దృష్టిని ఆకర్షించగల సామర్థ్యం ఉందన్నారు మోదీ. ఇందుకు అనువైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. దేశంలోని సినీ పరిశ్రమలు ఇక్కడ షూటింగ్‌లు జరిపితే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ప్రపంచంలోని ఇతర సినీ పరిశ్రమలు ఇక్కడ షూటింగ్ నిర్వహిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు మోదీ.
"జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందే సామర్థ్యం ఉంది. దీనికి కావాల్సిన వాతావరణాన్ని, చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుల్ని చేస్తున్నాం. కానీ ఇందులో దేశంలోని ప్రతి ఒక్కరి మద్దతు నాకు కావాలి. అప్పట్లో బాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు సుందరమైన ప్రదేశంగా కశ్మీర్ ఉండేది. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు శాంతిస్తే దేశం నుంచే కాదు ప్రపంచ దేశాల సినిమాల షూటింగ్‌లు జరుగుతాయి. ప్రతి చిత్రం కశ్మీర్ ప్రజల కోసం అనేక ఉద్యోగ అవకాశాలను తీసుకొస్తుంది. హిందీ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు కశ్మీర్లో సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ఏర్పాటు వంటివాటిపై తప్పకుండా ఆలోచించాలని కోరుతున్నా"
-నరేంద్ర మోదీ, ప్రధాని
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35-Aలను రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగానూ విభజించింది.