ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్ ద్వారా సంభాషించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా.. ఈ అంశమై కలిసి పోరాడాలని నేతలు ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్ ఎన్నికల్లో విజయం సాధించి గతనెలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఇరునేతల మధ్య సంభాషణ జరగడం ఇదే తొలిసారి. కరోనాను ఎదుర్కొనేందుకు పరస్పర సహకారం దిశగా మోదీ, నెతన్యాహు ఇప్పటివరకు మూడుసార్లు చర్చించారు. ఇజ్రాయెల్ వినతిపై ఇప్పటికే హెడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలను ఆ దేశానికి సరఫరా చేసింది భారత్.
కరోనాపై పోరులో భారత్, ఇజ్రాయెల్ కలిసి ముందుకు ఎలా సాగాలనే అంశమై ప్రధాని నెతన్యాహుతో ప్రయోజనాత్మక సంభాషణ జరిగిందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రధాని. ప్రధానిగా తిరిగి ఎన్నిక కావడం పట్ల నెతన్యాహుకు శుభాకాంక్షలు చెప్పారు.
నిపుణుల సేవలను పరస్పరం అందుకునే అంశమై సహకారం కొనసాగాలని ఇరునేతలు ఉద్ఘాటించినట్లు పీఎంఓ ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధం మానవాళికి ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షించినట్లు చెప్పింది.
కంబోడియా ప్రధానితోనూ..
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై కంబోడియా ప్రధానమంత్రి హున్‌సేన్‌తో చర్చించారు ప్రధాని మోదీ. అన్ని రంగాలలో కంబోడియాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిబద్ధులమై ఉన్నట్లు స్పష్టం చేశారు. కంబోడియా, భారత్ మధ్య సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని చెప్పారు మోదీ. కంబోడియాను కీలకమైన భాగస్వామిగా అభివర్ణించారు. భారతీయ సాంకేతిక ఆర్థిక సహకార కార్యక్రమం ఐటీఈసీ కింద నిర్వహించే కార్యక్రమాలు, మెకాంగ్-గంగా సహకార కార్యక్రమం కింద చేపట్టే ప్రాజెక్టులపై ఇరువురు నేతలు సమీక్షించారు.
ఇదీ చూడండి: 7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్