చందమామపై ల్యాండర్ విక్రమ్ దిగుతున్న సమయంలో తలెత్తిన సమస్య వల్ల నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా నిలిచారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని చెప్పారు.
"మీ ముఖాలు వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ మీరు చేసింది చిన్న విషయమేమీ కాదు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. మీ శ్రమతో ఎంతో నేర్పించారు. ఆశలు వదులుకోకూడదు. నా తరఫు నుంచి మీ అందరికీ అభినందనలు. దేశానికి మీరు ఎంతో గొప్ప సేవ చేశారు. మన ప్రయాణం కొనసాగుతుంది. నేను పూర్తిగా మీకు తోడుగా ఉంటాను. ధైర్యంతో ముందడుగు వేయండి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
అంతా సజావుగా సాగుతున్న సమయంలో ల్యాండర్ 'విక్రమ్'లో సమస్య తలెత్తడం వల్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలీమీటర్ల దూరంలో విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి.
చంద్రయాన్-2లోని కీలక ఘట్టాన్ని వీక్షించడానికి దేశ నలుమూలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించిన అనంతరం ప్రధాని ఇస్రో కేంద్రం నుంచి వెనుదిరిగారు మోదీ. అనంతరం ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో అధికారిక ప్రకటన చేసింది.
రాష్ట్రపతి ట్వీట్....
చంద్రయాన్-2పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అసమాన నిబద్ధత, ధైర్యసాహసాలను చూపించారని... దేశం ఎంతో గర్వ పడుతోందన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ... వారి సేవలను కొనియాడారు. ఇస్రో శ్రమ ఎన్నటికీ వృథా కాదని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:- చంద్రయాన్-2: విక్రమ్ ల్యాండింగ్‌లో సమస్య!