దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఏమాత్రం పట్టదని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. భారతీయుల మధ్య చిచ్చుపెట్టడంపైనే వారి దృష్టి ఉందని విమర్శించారు.
దిల్లీలోని జంగ్‌పుర నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి తర్విందర్ సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్. మోదీ-కేజ్రీవాల్.. అధికార దాహంతో ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
"నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. రెండు కోట్ల మంది భారత యువతకు ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఉద్యోగాలు వచ్చాయా? దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ... నిరుద్యోగ సమస్యపై స్పందించిందా? లేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. దేశంలోని కోట్లాది మంది యువత ఏదీ ఉచితంగా ఆశించడం లేదు. కేవలం ఉద్యోగాలు కావాలంటున్నారు. కానీ ఇవేవీ నరేంద్ర మోదీ, అరవింద్ కేజ్రీవాల్‌కు పట్టవు. కేవలం ద్వేషపూరిత ప్రసంగాలే వారికి వచ్చు. ఇద్దరు భారతీయుల మధ్య చిచ్చుపెట్టడమే తెలుసు. వారి ఆలోచన అంతా అధికారం గురించే."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
దేశంలో రోజురోజుకు గాడి తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దకుండా.. హింసను ప్రరేపించడమేంటని భాజపాను నిలదీశారు రాహుల్.
పాకిస్థాన్‌లో 'హిందుస్థాన్ జిందాబాద్' అంటూ నినాదాలు చేసిన ఒక్క భాజపా నేతను చూపించమన్నారు రాహుల్. కాంగ్రెస్ నేత తర్విందర్.. పాక్‌కు వెళ్లి ఎంతో ధైర్యంగా భారత అనుకూల నినాదాలు చేశారని.. ఆయనను జైలులో పెట్టినా బెదరలేదని ప్రశంసించారు.