మతం, ప్రాంతం, సంస్కృతి పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. ఎన్నికల సంఘం నిబంధనలను మోదీ ఉల్లఘింస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే, ప్రధాని మోదీ మాత్రం విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు సుర్జేవాలా.
" విభిన్న భాషలు, ఆహార అలవాట్లు, ధర్మాలు, సంస్కృతి, జీవిన విధానం ఉన్న మన దేశంలో రాజకీయ ఉద్దేశాలు, లబ్ధి కోసం విద్వేషపు విత్తనాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని... మీరు భారతీయ సంస్కృతిని అవమానిస్తున్నారు. దక్షిణ భారత దేశంలో హిందూ, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు లేరా? ఉత్తర భారత దేశం హృదయమైతే... దక్షిణం ఆ హృదయ స్పందన. ఈ ఆలోచనతోనే రాహుల్ గాంధీ ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. భాష నుంచి ఆహారం వరకు... వేషధారణ నుంచి సంస్కృతి వరకు.. అన్ని సంప్రదాయాలను ఏకం చేయడానికి కృషి చేస్తున్నారు. మరి ప్రధాన మంత్రి ధర్మం, జాతి, భాష, సంస్కృతి, జీవన విధానం అంశాలతో ఈ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు"
-- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
సాతంత్ర్యోద్యమాన్నీ మోదీ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుర్జేవాలా. ఆయన దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. ప్రధానికి కనీసం దేశ పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వాయనాడ్‌లో 50శాతం మంది హిందువులు ఉన్నారని చెప్పారు.
హిందువులు అధికంగా ఉన్న చోట ముఖ్యనేతలను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ భయపడుతోందంటూ రాహుల్ పేరును ప్రస్తావించకుండా మహారాష్ట్ర వార్దాలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు ప్రధాని నరేంద్ర మోదీ.