ఏ ప్రభుత్వమైనా రెండోసారి అధికారంలోకి వచ్చాక సులభ పాలనా విధానాన్ని అనుసరిస్తుంటుంది, కానీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గొప్ప నిర్ణయాలు తీసుకుందని భాజపా అనుబంధ నిపుణుల బృందం నివేదిక పేర్కొంది. మోదీ 2.0 వంద రోజుల పాలనపై '100 మైల్‌స్టోన్స్ ఇన్ 100డేస్' పేరుతో వ్యాసాన్ని విడుదల చేసింది 'ది పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సెంటర్(పీపీఆర్సీ)'.
మోదీ 2.0 సర్కారు 100 రోజుల పాలనలో సరికొత్త అధ్యాయాలను లిఖించిందని నివేదిక తెలిపింది.
ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఫలవంతంగా జరిగాయని భాజపా ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వినయ్ సహస్రబుద్ధె తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఎన్నో ఏళ్ల నిరీక్షణకు మోదీ ప్రభుత్వం తెరదించిందన్నారు. ముమ్మారు తలాక్‌ను రద్దు చేసి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు సహస్రబుద్ధె. ఆర్థిక సంస్కరణలలో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలనే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందని చెప్పారు.
భాగస్వామ్య అభివృద్ధిని ఆకాంక్షించే మోదీ.. సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రజలకు పిలుపునిచ్చారన్నారు సహస్రబుద్ధె. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిచ్చారని తెలిపారు.