మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి(కిసాన్ దివస్) సందర్భంగా రాజ్నాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చరణ్ సింగ్ స్ఫూర్తితో రైతుల కోసం ప్రధాని మోదీ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని తెలిపారు.
" నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంతమంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం వారితో చర్చలు జరుపుతోంది. త్వరలోనే రైతులు ఉద్యమాన్ని విరమించుకుంటారని భావిస్తున్నా"
--రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం నిరంతర కృషి చేశారని కొనియాడారు రాజ్నాథ్. రైతుల ఆదాయం పెంచేందుకు ఆయన శ్రమించారని గుర్తు చేశారు. అన్నదాతల వల్లే భారత్ ధాన్యబండాగారంలా మారిందని రైతులను ప్రశంసించారు.
ప్రధాని నివాళి ..
భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. గ్రామాలు, రైతుల అభివృద్ధికి చరణ్ సింగ్ చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుచేసుకోవాల్సిన విషయం అని ట్విట్టర్లో తెలిపారు.
'రైతులు ఆందోళన చేయటం దురదృష్టకరం'
జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రైతు ఉద్యమానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను గౌరవించాల్సిన కేంద్రమే.. అన్నదాతలను ఆందోళనల బాట పట్టించిందని ట్విట్టర్లో మండిపడ్డారు.
ఇదీ చదవండి : 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'