370వ అధికరణం జమ్మూ-కశ్మీర్‌లో అమలు కాకుండా చేసే నిబంధన కోసం మోదీ సర్కారు... రాజ్యాంగంలో ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం కలగలేదు. అదే అధికరణంలో మూడో సెక్షన్ కింద ఉన్న ఒక నిబంధన ప్రభుత్వానికి ఉపయోగపడింది.
ఎందుకు రద్దు చేయలేదు?
‘370’అధికరణాన్ని రద్దు చేయడం అంత సులువు కాదు. 368 అధికరణం కింద రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన దావాలు కూడా ఇందుకు ప్రతిబంధకమయ్యాయి. ఈ నేపథ్యంలో ‘370’లోని మూడో సెక్షన్ మోదీ సర్కారుకు వరంగా మారింది. రాజ్యాంగ సవరణ అవసరాన్ని అది తప్పించింది. అందువల్లే ఆ అధికరణాన్ని రద్దు చేయడంలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దిష్టంగా రాజ్యసభలో చెప్పారు.
3వ సెక్షన్‌లో ఏముంది?
‘370’లోని 3వ సెక్షన్ సారాంశం ప్రకారం.. ‘‘ఈ అధికరణంలో ఉద్ఘాటిస్తున్న అంశాల మాటెలా ఉన్నా ఒక బహిరంగ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రపతి ఈ అధికరణాన్ని క్రియారహితం చేయవచ్చు. లేదా కొన్ని మినహాయింపులు, సవరణలతోనే దాన్ని అమలు చేయవచ్చు.’’
* 370 అధికరణం చెల్లుబాటులో లేకుండా చేయడానికి పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరాన్ని కూడా 3వ సెక్షన్ తప్పించింది. అందువల్ల రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఆ పనిని కేంద్రం పూర్తి చేసింది. దీనిపై గతంలో జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వులను అధిగమించింది.
* ఇలాంటి ఆదేశాల జారీకి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం అవసరం. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్‌లో అసెంబ్లీ రద్దయింది. రాష్ట్రపతి పాలన ఉంది.
ఇదీ చూడండి: 'అపరిమిత ఉచిత కాలింగ్' ఇక ఉండదా..?