యోగా అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ప్రదానం చేస్తున్న 'ప్రధానమంత్రి యోగా అవార్డు-2019' కు ఎంపికైన వారికి ట్విట్టర్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. స్పానిష్, ఫ్రెంచ్, అరబిక్, రష్యన్, జపనీస్, ఆంగ్ల భాషల్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
" యోగా అభివృద్ధి, ప్రగతికి అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే 'ప్రధాన మంత్రి యోగా అవార్డు-2019'కు ఎంపికైన వారికి అభినందనలు. ఎక్కువ మందిని యోగావైపు నడిపించి మన భూ మండలం ఆరోగ్యంగా ఉండేందుకు మీరు చేసిన కృషికి మేము ఎంతో గర్వపడుతున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
విజేతలు...
'ప్రధాన మంత్రి యోగా అవార్డు-2019' కు ఎంపికైన వారిలో ఇటలీకి చెందిన ఆంటోనెట్ రోసి, గుజరాత్‌కు చెందిన లైఫ్ మిషన్ వ్యవస్థాపకుడు స్వామి రాజర్షి ముని ఉన్నారు. సంస్థల్లో బిహార్ యోగా పాఠశాల, జపాన్ యోగా నికేతన్లు ఉన్నాయి.
2016లో ఏర్పాటు...
2016 జూన్ 21న ఛండీగఢ్‌లో జరిగిన రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు ప్రధాని మోదీ. దీని కోసం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్వంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఇందులో రెండు కమిటీలు ఉంటాయి. యోగా అవార్డుకు ఎంపికైన వారికి ట్రోపీ, సర్టిఫికేట్‌తో పాటు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల నగదు బహుమతి అందిస్తారు.
ఇదీ చూడండి: జడ్జీల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి సీజేఐ లేఖ