రామ్ మాధవ్, అనిల్ జైన్, సరోజ్ పాండే, మురళీధర్ రావు... భాజపాలో కీలక నేతలైన వీరెవరి పేర్లు పార్టీ కొత్తగా ప్రకటించిన జాతీయ కార్యవర్గంలో కనపడకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా డజను మందికిపైగా సీనియర్లను పక్కనపెట్టడం ఒకింత సంచలనమే. అయితే ఇందుకు ఓ కారణం ఉందంటున్నారు విశ్లేషకులు. నడ్డా జట్టులో చోటు కోల్పోయిన సీనియర్లకు మోదీ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరగబోతుందని తెలుస్తోంది.
ఇంకా ఉన్నారు..
వీరితో పాటు ఉమా భారతి, ఓం మాథుర్, ప్రభాత్ ఝా, వినయ్ సహస్రబుద్దే, శ్యామ్ ఝా, అవినాశ్ రాయ్ ఖన్నా వంటి సీనియర్ నేతలకు కార్యవర్గంలో చోటు దక్కకపోవడం గమనార్హం.
కేబినెట్ విస్తరణ...
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది వారాల్లోనే కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. జాతీయ కార్యవర్గంలో చోటు కోల్పోయిన వారిలో కొంతమందికి కేబినెట్లో కీలక మంత్రిత్వశాఖలు దక్కే అవకాశం ఉందట.
బంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కీలక నేతలను పదవులు వరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కమలదళం ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం కేబినెట్లో పలువురు మంత్రులు ఒకటి కన్నా ఎక్కువ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇది వారిపై అధిక భారం మోపుతుందని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2019లో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి కేబినెట్ విస్తరణ కానుంది.