ఇంట్లో ఓ మనిషిలా కలిసిపోతాయి.. అనంతమైన ప్రేమను కురిపిస్తాయి పెంపుడు శునకాలు. అందుకే, వాటిని జంతువుల్లా కాక కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు చాలామంది. నెలకో, రెండు నెలలకో ఓసారి పెట్ సెలూన్లకు తీసుకెళ్లి గ్రూమింగ్ చేయించి.. ఆరోగ్య పరీక్షలు చేయించి శుభ్రంగా చూసుకుంటారు. కానీ, కరోనా వేళ తమ ప్రియమైన పెట్స్‌ను సెలూన్లకు తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే, పంజాబ్ లుధియానాకు చెందిన హర్షకుమార్.. 'మొబైల్ పెట్ గ్రూమింగ్' ఆలోచనను అమలు చేస్తున్నాడు.
లూధియానాలో తొలిసారిగా 'పప్ పింగ్' పేరిట ఓ వ్యాన్ సిద్ధం చేశాడు హర్షకుమార్. ఫోన్ చేయగానే ఇంటి వద్దకే వెళ్లి పెంపుడు కుక్కలు, పిల్లులకు క్షౌరం చేసేస్తున్నారు హర్షకుమార్ బృందం. అవసరమైన వైద్య సేవలూ అందిస్తున్నారు. దీంతో, జంతు ప్రేమికులకు పెట్ సెలూన్లు వెతుక్కునే పని తగ్గింది.
ఇప్పటికే హైదరాబాద్ వంటి మహానగరాల్లో అందుబాటులో ఉన్న ఈ మొబైల్ పెట్ గ్రూమింగ్ సేవలను పంజాబ్ వ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు హర్షకుమార్.
ఇదీ చదవండి: బైక్ కొనేందుకు బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు