కర్ణాటక మైసూర్ ఎమ్మెల్యే సారా మహేశ్‌కు కోతులు అంటే ఇష్టం. అందరూ పిల్లి, కుక్కని పెంచుకుంటూ ఉంటే ఆయన మాత్రం వానరాన్ని పెంచుకున్నారు. దానికి 'చింటూ' అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే అది ఏడాది కిందట విద్యుదాఘాతంతో చనిపోయింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కోతి మృతదేహానికి అంత్యక్రియలు చేసి.. అప్పుడు దానిపై తన ప్రేమను చాటుకున్నారు. తాజాగా చింటూ వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహించి.. కోతిపై తనకున్న ప్రేమను మరోసారి నిరూపించుకున్నారు.
కోతికో గుడి..
'చింటూ'కి మహేశ్‌కు ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని అంటున్నారు ఆయన గురించి తెలిసిన వారు. ఏడాది కిందట విద్యుదాఘాతంతో వానరం చనిపోతే.. సింగపూర్‌లో ఉన్న ఎమ్మెల్యే ట్రిప్‌ను కూడా రద్దు చేసుకుని మరీ వచ్చారు. తన ఫామ్‌హౌస్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. జ్ఞాపకార్థంగా గుడి కట్టించారు. అందులో చింటు ప్రతిమను నెలకొల్పారు. ఇలా ఆ వానరం మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.