మనం ఇంటికి వెళ్లగానే అమ్మ ఒక్క క్షణం కనపడకపోయినా కంగారు పడతాం. నిద్రలోంచి లేవగానే అమ్మా.. అమ్మా అంటూ దగ్గరికి వెళతాం. ఆ మాతృమూర్తి ఒక్కసారి కనిపించకపోతేనే అంతలా బాధ పడుతాం. అలాంటిది కనిపించకుండా పోయిన తన తల్లిని పదేళ్ల తర్వాత చూసిన ఈ గుజరాత్ వాసి సంతోషం వర్ణణాతీతం.
ఇలా కలిశారు...
36 ఏళ్ల మహేంద్ర గుజరాత్‌లోని సఖేడా నివాసి. 10 సంవత్సరాల క్రితం తన తల్లి శాంతాబాయి... ఇంటిని వదిలి వెళ్లిపోయింది. ఆమెకు మహేంద్రతో పాటు ఇద్దరు కూతుళ్లున్నారు. ఆ సమయంలో ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదు. బంధువులందరూ ఆశలు వదిలేసుకున్నారు. కొడుకు మాత్రం తల్లి ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు.
ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్‌లోని శంషాబాద్ పట్టణంలో చిన్నపిల్లలను అపహరిస్తుందనే అనుమానంతో స్థానికులు ఒక మహిళపై దాడి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆ మహిళ పరిస్థితిని చూసి జాలిపడ్డ పోలీసులు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
"ఆమె వివరాల కోసం ప్రయత్నించాం. కానీ ఆ మహిళకు తన పేరు మాత్రమే గుర్తుంది. దుస్తులు సరిగ్గా లేవు. ఆమెకు మంచి బట్టలు ఇచ్చాం. భోజనం పెట్టాం. టీ తాగించాం. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్రశ్నలు అడిగాం. తన గ్రామం పేరుతో సహా మరిన్ని వివరాలు చెప్పింది. వాటి ప్రకారం గుజరాత్‌లోని అనేక ఠాణాలను సంప్రదించాం."
- అరవింద్ సింగ్, శంషాబాద్ స్టేషన్ ఆఫీసర్
ఎంతో శ్రమించిన అనంతరం శాంతాబాయి తమ వద్ద ఉందని మహేంద్రకు సమాచారం అందించారు పోలీసులు. ఆదివారం శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన తల్లిని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడా పుత్రుడు. శాంతాబాయి కూడా తన కొడుకుని చూసి కన్నీరు పెట్టుకుంది.
ఇదీ చూడండి:- బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర