దేశంలో భారీ జలాశయాలు నిర్మించేందుకు అనువైన ప్రదేశాలు లేవని పేర్కొన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దాని ద్వారా నీటి భద్రత లభిస్తుందన్నారు. దిల్లీలో నిర్వహించిన నేషనల్ వాటర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు సింగ్.
భూగర్భ జలాల పెంపు, భూగర్భ జలాశయాల గుర్తింపుపై జలశక్తి మంత్రిత్వ శాఖ పనులు ప్రారంభించినట్లు తెలిపారు కేంద్రమంత్రి.
"ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మరిన్ని పెద్ద పెద్ద డ్యాంలు నిర్మించగలమని అనుకోవట్లేదు. అలాంటి భౌగోళిక ప్రదేశాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్మిస్తాం. ఈ రోజు ఉన్న పరిస్థితులను చూస్తే.. వేళ్లపై లెక్కించే ప్రదేశాలు కూడా మనకు లేవు."
- గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి.
దేశంలో 736 ప్రధాన జలాశయాలు ఉన్నాయని, వాటి నిర్మాణంలో పెద్ద సంఖ్యలో ప్రజలను ఖాళీ చేయటం సహా పెద్ద ఎత్తున భూమి నీటిలో మునిగిపోయిందన్నారు మంత్రి. భవిష్యత్తు తరాల మనగడకు భూగర్భ జలాలు చాలా ముఖ్యమని, అందరికీ నీటి భద్రతను కల్పిస్తాయన్నారు.
జేజేఎం ఒక గేమ్ ఛేంజర్..
జల్ జీవన్ మిషన్ అనేది కేవలం ప్రజలకు నల్లాల ద్వారా మంచి నీటిని అందించటమే కాదని, నీటి ఉపయోగం పట్ల వారి ప్రవర్తనలో మార్పు తేవాలనే లక్ష్యంగా చేపట్టిందన్నారు షెకావత్. ఇది ఓ గేమ్ ఛేంజర్‌లా పని చేస్తుందన్నారు. దేశ శ్రేయస్సులో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. తాగునీటిని అందించటం సహా నీటి మూలల సుస్థిరత కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో చెరువు, సరస్సు, బావులు, గొట్టపు బావుల వంటి నీటి లభ్యత ఉంటే.. ఆ వనరులను రీఛార్జ్ చేసే పని జరగాలని సూచించారు.
ఇదీ చూడండి: 'భారత్-ఆసియాన్ కనెక్టివిటీ పెంచడమే లక్ష్యం'