భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అక్టోబర్ 6, 7 తేదీల్లో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్ విదేశాంగ మంత్రి తొషిమిత్సు మొటెగీతో భేటీ కానున్నారు. దీంతోపాటు చతుర్భుజి కూటమి దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా జపాన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై జైశంకర్ సమాలోచనలు జరపనున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
"అక్టోబర్ 6న భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల మధ్య జరిగే విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ పాల్గొననున్నారు. కొవిడ్ తదనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ సహకారం, మహమ్మారి నుంచి ఎదురవుతున్న అనేక సవాళ్లపై మంత్రులు చర్చిస్తారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంతో స్వేచ్ఛ, సమగ్రత ప్రాముఖ్యతపై దృష్టిసారిస్తారు."
-విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జపాన్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, అమెరికా విదేశాంగ మంత్రులతో జైశంకర్ విడిగా సమావేశమవుతారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమావేశాల్లో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి- పోలీసుగా సేవ చేస్తూనే ఉత్తమ కళాకారుడిగా గుర్తింపు