సాగు చట్టాలపై ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. ఎంఎస్పీ ప్రస్తుతం ఉందని, ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం కొనసాగుతుందని తెలిపారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. కేంద్రం-రైతుల మధ్య అనేక దఫాల చర్చలు జరిపాయని చెప్పారు మోదీ. వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, వారి ఆందోళనలకు కారణం ఏంటో తెలియట్లేదని అన్నారు. ఈ చట్టాల అమలు కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని మోదీ కోరారు. ఈ సందర్భంగా అన్నదాతల సంక్షేమానికి కేంద్రం తీసుకొచ్చిన పథకాల గురించి వివరించారు.
"చట్టాల్లో ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పట్లేదు. రైతుల ఆందోళనలకు కారణం ఏంటో తెలియట్లేదు. రైతుల కోసం కిసాన్ క్రిడెట్, ఫసల్ బీమా యోజన తెచ్చాం. ఈ పథకాన్ని మరింత విస్తరిస్తాం. చిన్న, సన్నకారు రైతుల కోసం పింఛను పథకం తెచ్చాం. గ్రామ్ సడక్ యోజన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుస్తాం. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయి. సమస్యలను సమష్టిగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి"
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులకు ఉన్న అడ్డంకులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు మోదీ. '1930లో ప్రవేశపెట్టిన మార్కెటింగ్ పాలన వల్ల రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరకు విక్రయించలేకపోతున్నారని, ఈ అడ్డంకులను తొలగించడమే తమ లక్ష్యమని మన్మోహన్ చెప్పార'ని మోదీ పేర్కొన్నారు. సాగు చట్టాలపై యూటర్న్ తీసుకున్నవారు దీనికి అంగీకరిస్తారని అన్నారు.
శరద్ పవార్, కాంగ్రెస్ నేతలతో పాటు అన్ని ప్రభుత్వాలు వ్యవసాయ సంస్కరణలకు కట్టుబడే ఉన్నాయని మోదీ అన్నారు. అమలు చేశారా? లేదా? అన్న విషయాన్ని పక్కనబెడితే.. వారంతా సంస్కరణలు తీసుకురావాలనే భావించారని చెప్పారు.
ఇదీ చదవండి: 2013 వరదలా... అమ్మ బాబోయ్