కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా వలస కూలీల బతుకులు దయనీయంగా మారాయి. ఉండటానికి ఆశ్రయం లేక.. వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలినడకనే వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు. వారు ఇంకా ఎలాంటి అవస్థలు పడుతున్నారో తెలిపే హృదయ విదారక ఘటన దిల్లీలో జరిగింది. 8 నెలల కుమారుడు మరణించిన విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు ఓ వలస కూలీ. బిహార్‌లోని స్వగ్రామానికి చేరుకునేందుకు కాలినడకనే బయలుదేరాడు. దిల్లీ- ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దులో పోలీసులు అతడిని అడ్డుకోవడం వల్ల ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోయాడు. ఫోన్ చేసిన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు.
తిండి కూడా లేకుండా...
బిహార్ బెగుసరాయ్‌కు చెందిన రామ్ పుకార్.. బతుకు తెరువుకోసం దిల్లీలోని నవాడకు వలసవచ్చాడు. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. తన కుమారుడు మరణించాడని కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఎలాగైనా సొంతూరు చేరాలని ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ దిల్లీ-యూపీ సరిహద్దులో పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. ఏం చేయాలో తెలియక ఘాజీపుర్ ఫ్లై ఓవర్ కిందే మూడు రోజులు గడిపాడు. తినడానికి తిండి కూడా లేక పస్తులున్నాడు. నిస్సాయుడై కుప్పకూలిపోయాడు.
కానిస్టేబుల్ చొరవ
రామ్ పుకార్ ఎడుస్తుండటం చూసిన ఓ పోలీస్ కానిస్టేబుల్ అతడి వద్దకు వెళ్లి విషయం తెలుసుకున్నాడు. వెంటనే అతని పరిస్థితి గురించి తూర్పు దిల్లీ జిల్లా మెజిస్ట్రేట్ అధికారికి వివరించాడు. చలించిపోయిన అధికారి.. రామ్ పుకార్ ఇంటికి చేరుకునేలా రవాణా ఏర్పాటు చేశారు.