కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ వలస కార్మికుల జీవితాల్ని ఛిద్రం చేసింది. ఉండటానికి ఆశ్రయం లేక, సొంతగూటికి వెళ్లే వీలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వందల కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణిస్తున్నారు. వారి కష్టాన్ని కళ్లకు కట్టే మరో ఘటన తాజాగా వెలుగుచూసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న ఓ వలస కూలీ గర్భవతి అయినా కూడా కాలినడకనే తన సొంత రాష్ట్రం బంగాల్‌కు బయలుదేరింది. భర్తతో కలిసి వందల కి.మీ ప్రయాణించింది.
కొద్ది రోజుల ప్రయాణం తర్వాత బంగాల్-ఒడిశా సరిహద్దుకు చేరుకున్నారు ఆ భార్యాభర్తలు. పోలీస్ చెక్ పాయింట్ వద్ద గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మహిళ పేరు నజీరా బీబీ అని, బంగాల్ దక్షిణ పరగణాల జిల్లాలోని భాన్గర్కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.