దేశంలో లాక్డౌన్ కొనసాగింపుపై అభిప్రాయాలు తెలపాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర హోంశాఖ కోరింది. దేశంలో విజృంభిస్తోన్న కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మరో 2 వారాలపాటు ఆంక్షలను పొడిగిస్తారన్న వార్తల నడుమ హోంశాఖ తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మార్చి 24న ప్రకటించిన లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలకు హోంశాఖ నిర్దేశించింది. ఈ పరిస్థితుల్లో ఏవైనా సేవలు, ప్రజలకు ఇవ్వాల్సిన మినహాయింపులపై కూడా నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలను కోరింది. పంట కోతలకు అనుమతులు ఇవ్వాలని సూచించింది.
కేంద్ర హోంశాఖ ఆదేశాల అనుసారం బిహార్ సహా పలు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను నివేదించాయి. గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులకు అనుమతి ఇవ్వాలని సూచించాయి.
మత కార్యక్రమాలపై..
ఏప్రిల్లో పండుగలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది హోంశాఖ. 21 రోజుల లాక్డౌన్ కాలంలో ఎలాంటి మత, సామాజిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని ఆదేశించింది.
సరిహద్దు వద్ద..
దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్న వేళ సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉండాలని బీఎస్ఎఫ్ను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పాకిస్థాన్, బంగ్లాదేశ్.. ముఖ్యంగా కంచె లేని ప్రాంతాల్లో పహారా పెంచాలని సూచించారు.
రెండు దేశాల సరిహద్దు భద్రతపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలు జారీ చేశారు అమిత్ షా. చొరబాట్లు జరిగే అవకాశముందని తెలిపారు.
పీఎంఓ పర్యవేక్షణ
కరోనా వైరస్ పోరాటంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు ప్రధాని మోదీ నియమించిన 11 సాధికారిక బృందాలతో పీఎం ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా భేటీ అయ్యారు. వైరస్ పరీక్షల విధానంపై ఈ సమావేశంలో సంతృప్తి వ్యక్తం చేశారు అధికారులు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,45,916 శాంపిళ్లను పరీక్షించినట్లు సమాచారం.
ఇదీ చూడండి: లాక్డౌన్ పొడిగింపుపై రేపు మోదీ ప్రకటన!