కరోనాతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడని పిల్లలు ఒకింత కలత, ఆందోళన, ఉద్విగ్నతలకు లోనయ్యే అవకాశం ఉన్నందున, వారి మానసికోల్లాసానికి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు సూచనలు చేసింది.
ఓర్పుగా.. నేర్పుగా..
పిల్లలు అడిగే ప్రశ్నలన్నింటికీ ఓపిగ్గా, నేర్పుగా సమాధానం చెప్పాలి. బయటకెళ్లలేని పరిస్థితులు ఎందుకొచ్చాయో వివరించాలి. నాణ్యమైన సమయాన్ని గడుపుతూ, వారికి అవసరమైన అంశాలపైనా దృష్టి సారించాలి. కథలు చెబుతూ నిద్రపుచ్చడంతో వారు మరింత అప్యాయతను పొందుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనం వద్దు.
భావోద్వేగాలు కీలకం
పిల్లల భావోద్వేగాలను కనిపెడుతుండాలి. అనునయిస్తూ మాట్లాడుతూ ఉండాలి. వారేమైనా భావాలను వ్యక్తం చేసేటప్పుడు ముందే కొట్టిపారేయొద్దు. కరోనాకు సంబంధించి ప్రశ్నలు అడిగితే అర్థమయ్యేలా చెప్పాలి. సమస్యను వివరంగా చెప్పడం వల్ల పిల్లలూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. వీలయితే బొమ్మల ద్వారా వారికి పరిస్థితిని వివరించాలి. ఫోన్‌లోనూ, వీడియోకాల్ ద్వారా పిల్లల స్నేహితులతోనూ, బంధువులతోనూ మాట్లాడిస్తుండాలి.
ఆటలు.. పాటలు
పిల్లలు ఇంట్లోనే ఆడుకొనేలా ఏర్పాట్లు చేయాలి. చిన్న పజిల్స్ ఇవ్వడం, కొత్త క్రాఫ్ట్స్ నేర్పించడం వంటివి చేయాలి. యోగా, డ్యాన్స్ వంటివాటిలో ప్రోత్సహించాలి.
చదువులూ ముఖ్యమే..
ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను మూసివేసినా పిల్లల చదువును ఆపేయకూడదు. వారికి పాఠశాల సిబ్బంది ఆన్‌లైన్‌లో లేదా ఫోన్‌లో ఏవైనా అసైన్‌మెంట్లు ఇస్తే చేయిస్తుండండి. పాఠాలు మరిచిపోకుండా రోజూ చదివించాలి.
హెల్ప్‌లైన్
ఏవైనా సమస్యలుంటే 080-46110007 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలి.
ఇదీ చూడండి:కరోనా కట్టడిలో 'హీరోల' తీరు స్ఫూర్తిదాయకం