దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30 మంది మృతి చెందగా, 693 కొత్త కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 4,067 కొవిడ్-19 కేసులు నమోదవగా.. ఇందులో తబ్లీగీ జమాత్‌కు సంబంధించినవే 1,445 అని పేర్కొంది. మొత్తం 109 మరణాలు నమోదైనట్లు పేర్కొంది. అలాగే వైరస్ సోకి మరణించిన వారిలో అత్యధికులు పురుషులే ఉన్నారని స్పష్టం చేశారు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.
" కొవిడ్-19 మృతుల్లో పురుషులు 73 శాతం, మహిళలు 27 శాతం మంది ఉన్నారు. కేసుల పరంగా చూస్తే, పురుషులు 76, మహిళలు 24 శాతం మంది ఉన్నారు. మృతుల్లో 60 ఏళ్లకు మించినవారు 63 శాతం ఉండగా.. 40-60 ఏళ్ల మధ్య ఉన్నవారు 30 శాతం, 40 ఏళ్ల లోపున్నవారు 7 శాతం మంది ఉన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగించాల్సిందిగా కొవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రమే సూచించాం. అయితే అది కరోనాపై సమర్థంగా పనిచేస్తుందనడానికి పరిమిత ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అందరూ ఇదే వినియోగించాలని చెప్పేందుకు తగిన రుజువులు లేవు."
- లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి
ఆహార ధాన్యాల కొరత లేదు
దేశంలో ఆహార వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందుల్లేవన్నారు లవ్ అగర్వాల్. ప్రస్తుతం సరిపడా ఆహార నిల్వలున్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16.94 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల రవాణా జరిగిందన్న అగర్వాల్.. గత 13 రోజుల్లో 1340 వ్యాగన్ల చక్కెర, 958 వ్యాగన్ల ఉప్పు సరఫరా చేసినట్లు గుర్తుచేశారు. 13 రాష్ట్రాల్లో ఇప్పటివరకు 1.3 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ రవాణా జరిగ్గా.. 8 రాష్ట్రాలకు ఇప్పటివరకు 1.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించినట్లు స్పష్టం చేశారు.
5 లక్షల రాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్లు
దేశంలోని హాట్స్పాట్లలో కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు 5 లక్షల రాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇందులో 2.5 లక్షల కిట్లు ఏప్రిల్ 8-9 కల్లా డెలివరీ అవుతాయని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో 781
మహారాష్ట్రలో ఇవాళ మరో 33 మందికి కరోనా సోకినందున రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 781కి చేరింది. దేశంలో ఒక రాష్ట్రంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. తమిళనాడు-571, దిల్లీ-503, తెలంగాణ-321, కేరళ-314 తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
రాజస్థాన్‌లో 60 ఏళ్ల వృద్ధుడు ఇవాళ కరోనాతో మృతి చెందాడు. అలాగే 22 మందికి కొత్తగా వైరస్ సోకినందున రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 288కి చేరింది. అటు మధ్యప్రదేశ్‌లోనూ ఇవాళ మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది.